Site icon NTV Telugu

Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంఖ్యల చుట్టూ తిరిగే అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడి చుట్టూ తిరిగే మానవీయ కోణం ఉన్న ప్రణాళిక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక కుటుంబాలు యజమానిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండటాన్ని తాము గమనించామని, అందుకే రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేలా భారీ ఎత్తున జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. ఎదిగే వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?

రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని భట్టి వివరించారు. లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలని, నిధుల విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే వారానికి ఒకసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు మరో ‘తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్’ను కేటాయిస్తున్నామని, విద్యార్థులు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారికి నెలకు రూ. 2,000 స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు.

PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెబుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి క్యాష్‌లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నామని, ఇది వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఇప్పటికే రూ. 25 వేల దాకా బోనస్ అందించామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఆగ్రో మెడిసిన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలు పొందిన రైతులకు బోర్ బావుల ఏర్పాటుతో పాటు సోలార్ ప్యానెల్స్ వేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

విద్యా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 150 కోట్లు మంజూరు చేశామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాలకు కూడా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చివరి వరకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడటమే తమ అదృష్టమని, కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన సగర్వంగా ప్రకటించారు.

Exit mobile version