భక్తిటీవీ కోటి దీపోత్సవం నాలుగవ రోజుకి చేరింది. రోజురోజుకీ భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. అక్టోబర్ 31వ తేదీనుంచి ప్రారంభం అయిన ఈ మహాక్రతువు నవంబర్ 14 వరకూ కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం అయిందంటే చాలు.. ఎన్టీఆర్ గార్డెన్ భక్త.జన సంద్రంగా మారుతోంది.
కోటి దీపోత్సవం నాల్గవ రోజు కార్యక్రమాలు
అనుగ్రహ భాషణం: శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం వుంటుంది
బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తి వారిచే ప్రవచానమృతం ఉంటుంది
వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం వుంటుంది
శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే పూజలో భాగంగా నిర్వహిస్తారు
యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి పరిణయోత్సవం, వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి కల్యాణం ఇవాళ వైభవంగా నిర్వహించనున్నారు
అశ్వవాహనం, పల్లకి సేవ ఇవాళ వాహనసేవలో భాగంగా నిర్వహిస్తారు.
భక్తులంతా అశేషంగా తరలివచ్చి ఆ పరమశివుని, విష్ణువుల కరుణా కటాక్ష వీక్షణలు పొందవచ్చును. మూడవరోజు భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అశేష భక్తులు తరలిరాగా కోటిదీపాలు వెలిగించి ఎన్టీఆర్ స్టేడియాన్ని, ఇటు భాగ్యనగరాన్ని దేదీప్యమానంగా మార్చేశారు. కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా.. ఇష్టకామ్యాలను ప్రసాదించే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. మూషిక వాహన సేవ.. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం వైభవంగా సాగింది.
కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు.. ఓం నమఃశివాయా అంటూ.. పరిసర ప్రాంతాలను మార్మోగించారు.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం మూడో రోజు కూడా కన్నుల పండుగగా సాగింది. ప్రతిరోజూ కోటి దీపోత్సవానికి రావాలని భక్తులు కోరుకుంటారు. రాలేని వారు ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరిస్తున్నారు. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.