NTV Telugu Site icon

Betting on Elections: ఎన్నికల వేళ వేల కోట్లలో బెట్టింగులు.. ఆ నియోజకవర్గాలపై బెట్టింగా రాయుళ్ల ఫోకస్‌..!?

Betting

Betting

Betting on Elections: దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు.

మంగళగిరిలో గెలిచేదెవరు..? కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు..? భీమిలిలో పరిస్థితి ఏంటి..? ఇలా కొన్ని స్పెసిఫిక్‌ స్థానాలపై ఓ రేంజ్‌లో బెట్టింగులు జరుగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే.. పులివెందులలో మాత్రం ఏపీ సీఎం జగన్‌కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

ఇక, కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి.. మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైనా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో.. బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి.. గెలిచినవారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్‌కు వందకు 2.5 శాతం కమీషన్ ఇచ్చేలా కండిషన్‌ ఉంటోంది. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి.. మరి కొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు.. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిష నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతుంది. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అని చర్చ జరుగుతుంది.