NTV Telugu Site icon

VC Sajjanar : బెట్టింగ్ యాప్‌లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు

Vc Sajjanar

Vc Sajjanar

VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఇటీవల ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌పై నమోదైన కేసుల్లో సజ్జనార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై కూడా దృష్టి సారించారు.

సజ్జనార్ హర్ష సాయికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు, ఇందులో హర్ష సాయి తన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను సమర్థించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. “నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్లు చేస్తారు, కనుక ఇది తప్పు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సజ్జనార్, “తప్పే చేస్తున్నా, దాన్ని సమర్థించుకోవడం సరికాదు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా కనీస బాధ్యత లేకుండా డబ్బే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు” అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన యువతను ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను అన్‌ఫాలో చేయాలని, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయాలని సూచించారు. అలాగే, ఈ వీడియోను కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సైబర్ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది.

సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, “బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను అరికట్టేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి. అనేక మంది ప్రాణాలను రక్షించాలి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, సామాజిక మార్పు కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అతడి తాజా చర్యలు మరికొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా బేరీజు వేసుకునేలా చేస్తున్నాయి.

Byreddy Siddharth Reddy vs Byreddy Shabari: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. బైరెడ్డి శబరి కౌంటర్‌ ఎటాక్‌..