Best Tips For Brain Development Telugu
కొన్ని పనులకు శారీరిక బలం ఉంటే సరిపోతుంది. కానీ కొన్ని పనులకు బుద్ధిబలం కూడా అవసరం. బుద్ధి బలం పెరగాలంటే మన మెదడుకి మంచి శిక్షణ ఇవ్వాలి. చురుగ్గా పని చేసేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు స్మార్ట్‌గా ఆలోచించి సమస్యకు తగిన పరిష్కారం దొరికేలా మన మెదడుని తయారు చేసుకోవాలి. నడకతో మెదడుకు మేలు అంటున్నారు పరిశోధకులు. యువకులు, నడి వయస్కులు కన్నా ఎక్కువగా వృద్ధులకి ఆరోగ్యంగా ఉండటంలో దోహత పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు నడవ గలిగితే వారికి మతి మరుపు సమస్య తలెత్తదు అని, అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్నదానికన్నా వారి మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకులు వృద్ధులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ వారిని ప్రతిరోజు నాలుగు వేల అడుగులు నడవ మన్నారు. రెండో గ్రూప్ వారిని ఎప్పటిలాగే ఉండమన్నారు. కొద్ది రోజుల తర్వాత నాలుగు వేల అడుగులు నడిచిన వృద్ధులలో ఊహించని విధంగా మార్పు కనిపించింది. వారి మెదడు మునుపటి కన్నా చురుగ్గా పని చేస్తుందని వారు కనుగొన్నారు. కేవలం నడవటం వలన ఇంత మార్పు చోటు చేసుకుందా అని మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తునారు.
వేరుశనగతో మెదడుకి ఆరోగ్యం, మనం టైంపాస్ కోసం తినే వేరుశనగ గింజలతో కూడా మెదడుకి ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే బీ3 విటమిన్లు మన మెదడు జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహత పడుతుందని చెప్పుతున్నారు. వేరుశనగలో ఉండే అమినో యాసిడ్స్ ప్రశాంతతను పెంచే సెరిటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయని, వాటివలన మనసు ఉల్లాసంగా ఉంటుందని, అలాగే మెదడు చురుగ్గా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. బాగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు గుప్పెడు శనగలు గింజలు తింటే త్వరగా డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయాలంటే మౌనంగా ఉండటం కూడా ఒక మంచి మార్గం అని, సైలంట్‌కి బ్రెయిన్‌కి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. బాగా ఒత్తిడికి గురైనప్పుడు కాసేపు ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మౌనంగా ఉన్నప్పుడు మెదడులోని ఇప్పు హిపోకంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడతాయి అని, అవి మైండ్ డిప్రెషన్‌ను తగ్గిస్తాయి అని అంటున్నారు.
ఈ కణాలు కొత్త ఆలోచనలు రావడానికి బాగా పనిచేస్తాయి. దీనిని మొదటగా ఎలుకల మీద ప్రయోగం చేశారు. కొన్ని ఎలుకలను, ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ఎలాంటి శబ్దాలు లేకుండా ఉంచారు. దానితో కొంతకాలం తర్వాత వాటి మెదడులో హిపోకంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడ్డాయని నిపుణులు వెల్లడించారు. అదే విధంగా మనం ప్రశాంతంగా, మౌనంగా ఉండటం వలన మన భావోద్వేగాలను సులువుగా నియంత్రించుకోవచ్చు. వ్యాయామంతో కూడా మెదడుకి ఆరోగ్యం.
ప్రతిరోజు 20 నిమిషాల పాటు తీవ్ర వ్యాయామం చేస్తే మెదడు చురుగ్గా తయారవుతుందని ఒక పరిశోధనలో తేలింది. చిత్త వైకల్యం, అల్జైమర్స్‌తో బాధపడేవాళ్ళు ఎక్కువగా శ్రమిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 6 వారాల పాటు కొంత సమయం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసిన వారిని పరిశీలించగా వారి జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనబడినట్టు వెల్లడించారు.
మనం ఏ పని చేయాలన్నా మెదడు చురుకుదనం చాలా అవసరం. బ్రెయిన్ పవర్ పెంచాలంటే ఎప్పుడు మెదడుని ఊరికే ఉంచకుండా ఏదో ఒక పని అప్పగిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ చేసే పనులను కొత్తగా చేయడంలో లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా నిరంతరం మెదడుకి పని అప్పగిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సుడోకో లాంటి ఆడటం వలన ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మెదడుకి ఒత్తిడి పెరిగినప్పుడు పనిభారం ఎక్కువైనప్పుడు దానికి తగినంత విశ్రాంతి తీసుకోవటం ఎంతగానో అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పై చెప్పిన విధంగా పలు పద్ధతులను పాటించి మన మెదడుని చురుగ్గా పని చేసేలా చేసుకోవచ్చు.