Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. నగరంలోని నల్లురహళ్లి ప్రాంతంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడిని మురళి గోవిందరాజుగా గుర్తించారు. నిర్మాణం అవుతున్న ఇంటిలోనే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Pawan Kalyan: గుర్తింపు కోసం నేను పనిచేయను.. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా!
తన కుమారుడు ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే మరణించాడని, డబ్బులు డిమాండ్ చేసిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మురళి తల్లి ఆరోపించింది. తన భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ట, దేశితతో నివసించే మురళి 2018లో బంధువుల నుంచి నల్లురహళ్లిలో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారని తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలంలో మురళి ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 25న ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు అనేక సార్లు ఇంటి వద్దకు వచ్చి రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు.
మురళి వారికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, వారు కొంత మంది గ్రేటర్ బెంగళూర్ అథారిటీ అధికారులతో కుమ్మక్కు అయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదే పదే సందర్శించి, తన కొడుకును మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రోజు మురళిని పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి, తన కొత్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది.
