భారత జట్టు మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ టీమిండియాలో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడా? అంటే.. అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజాగా పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా భజ్జీని పంజాబ్ నామినేట్ చేసింది. ఈ నెల చివరలో జరిగే ఏజీఎంకు పంజాబ్ తరఫున అతడు హాజరవుతాడు.
సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంజాబ్ తరఫున హర్భజన్ సింగ్ హాజరవుతాడు. అలానే బెంగాల్ క్రికెట్ సంఘం తరఫున ఏజీఎంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొంటాడు. భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కూడా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నారని తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడిని నియమించేందుకు ఎన్నికలు నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తోంది. రాష్ట్ర బోర్డులు ఏకగ్రీవంగా అధ్యక్షుడికి మద్దతు తెలిపేలా బీసీసీఐ చర్యలు చేపట్టినట్లు సమాచారం. హర్భజన్‌కే బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కనుందని సమాచారం. మరో రెండు వారాల్లో ఎవరు బాస్ అనేది తేలనుంది.
Also Read: Boycott Asia Cup 2025: ‘బాయ్‌కాట్’ క్యాంపెయిన్.. వెనక్కి తగ్గిన బీసీసీఐ!
బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ తప్పుకున్న విషయం తెలిసిందే. బిన్నీ 2022లో బాధ్యతలు స్వీకరించారు. 70 ఏళ్లు నిండిన కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ అని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆ కథనాలను ఆయన టీమ్ ఖండించింది. హర్భజన్ సింగ్ ఏజీఎంకు హాజరవుతున్న కారణంగా అతడే బాస్ అని అంటున్నారు. భారత్ తరఫున హర్భజన్ 367 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 700 వికెట్లు పడగొట్టాడు.