వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2024పై ఉత్కంఠ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. చివరకు ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే కండిషన్స్ పెట్టి ఓకే చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే.. భవిష్యత్‌లో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా తాము అదే మోడల్‌లో ఆడుతామని ఐసీసీకి పీసీబీ తెలిపింది. ఈ నేపథ్యంలో పీసీబీ పెట్టిన కండిషన్‌కు బీసీసీఐ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
భారత్‌లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని, ఇక్కడ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లకు హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ మీడియా తమ కథనంలో పేర్కొంది. భారత్‌లో వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇక 2026లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనేకాదు 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌లు భారత్‌లో జరగనున్నాయి. వరుసగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఈ డిమాండ్ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై పీసీబీ తన మొండి వైఖరిని అలాగే కొనసాగిస్తే ఆతిథ్య హక్కులను కోల్పోయే అవకాశం ఉంది. ఐసీసీ ఇప్పటికే ఈ విషయాన్ని పీసీబీకి స్పష్టం చేసింది. పాకిస్తాన్ దారిలోకి రాకుంటే టోర్నీని ఇతర దేశాలకు ఐసీసీ తరలించే అవకాశం ఉంది. శ్రీలంక, నేపాల్ దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.