Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్‌ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..

Shubman Gill

Shubman Gill

Shubman Gill: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ క్రేజీ అడ్వైస్ వచ్చింది. మైదానంలో పరుగుల వరద పారించాలంటే, కాసేపు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బోర్డు ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మన ఆటగాళ్లు లండన్‌లోని ఇండియా హౌస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జట్టును ముందుండి నడిపిస్తున్న వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒత్తిడిని ఎలా జయిస్తాడనే విషయంపై మనసు విప్పాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌కు ముందే గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. తన చేతిలో లేని బయటి అంశాల గురించి ఆలోచించకుండా, కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా సులభంగా అధిగమించగలనని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే టీమిండియాలో క్యాంప్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు, గాయాల బారిన పడి కోలుకున్న టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కమ్‌బ్యాక్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, వారు ఇచ్చిన మద్దతు తనలో ఎంతో స్ఫూర్తిని నింపాయని, అందుకే మరింత బలంగా జట్టులోకి తిరిగి రాగలిగానని అయ్యర్ భావోద్వేగంగా చెప్పాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ భారత్-బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రక సంబంధాల వల్ల యూకే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రదేశమేనని అన్నారు. భారత క్రికెట్ అనేది కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాదని, జట్టును బేషరతుగా ప్రేమించే ప్రతి ఒక్క నిజాయితీ గల అభిమానికి చెందుతుందని గంభీర్ క్లారిటీ ఇచ్చారు.

ఇదే వేదికపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లకు ఒక కీలక సూచన చేశారు. భారతదేశంలో 99 శాతం మంది ప్రజలు తమను తాము క్రికెట్ నిపుణులుగా భావిస్తుంటారని, అందుకే మ్యాచ్‌లకు ముందు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. మన జట్టులో ప్రతిభకు కొదవలేదని, కేవలం ఆటపై దృష్టి పెడితే చాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చిన యూకేలోని భారత హైకమిషనర్ పి. కుమారన్, డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండేలు జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఇదే వారంలో అమల్లోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) వ్యాపారంతో పాటు క్రీడారంగానికి కూడా ఎన్నో కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇన్నాళ్లూ టీమిండియా సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు.