హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. వారి ఎస్‌యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో కారులో నీరు పోయి మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. మృతులు ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు పుణ్యాశ్రయ్ శర్మ (48), విరాజ్ (26)గా గుర్తించారు. గురుగ్రామ్ నుండి గ్రేటర్ ఫరీదాబాద్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కురిసిన వర్షం కారణంగా అండర్‌పాస్‌లో భారీగా నీరు నిలిచిందని, ముందుజాగ్రత్త చర్యగా అందులోకి కార్లు వెళ్లొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. రాత్రి 11:50 గంటల ప్రాంతంలో ఒక SUV 700.. అండర్‌పాస్‌లోకి ప్రవేశించి లోతైన నీటిలో చిక్కుకుందని, ఆ తర్వాత కారులోకి నీరు ప్రవేశించిందని పోలీసులు చెప్పారు. అయితే.. కారులో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను బాటసారులు ఆదుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. చాలా ప్రయత్నాల తర్వాత వారిని బయటకు తీయగా.. అప్పటికే విరాజ్ మృతి చెందాడు. శర్మను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
మృతులిద్దరూ గురుగ్రామ్‌లోని సెక్టార్ -31లోని హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. విరాజ్ ద్వివేది క్యాషియర్‌గా, పుష్యశ్రే శర్మ మేనేజర్‌గా ఉన్నారు. అండర్‌పాస్‌లో నీరు ఎక్కువగా ఉందని, దాని వల్లే కారు మునిగిపోయిందని ఈ విషయం తనకు తెలియదని మృతుడి సహచరుడు ఆదిత్య తెలిపాడు. విరాజ్ ను కారు నుంచి తీయడానికి ప్రయత్నించినప్పటికీ.. కారులోకి ఎక్కువ నీరు పోవడంతో డోర్లు లాక్ అయిపోయాయి. ఆ తర్వాత కారులో నీళ్లు నిండిపోవడంతో ఇద్దరూ చనిపోయినట్లు ఆదిత్య చెప్పాడు.
మరోవైపు.. అండర్‌పాస్‌లో బారికేడింగ్ లేదని ఆదిత్య తెలిపాడు. బారికేడింగ్‌లు ఉంటే బహుశా కారును అండర్‌పాస్‌లోకి తీసుకెళ్లి ఉండేవారు కాదన్నాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. రైల్వే అండర్‌పాస్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని.. ఈ మార్గంలో వెళ్లకుండా నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ.. వారు అండర్పాస్ లోకి నీటిలో చిక్కుకుని చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.