NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు? స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం

Muhammad Yunus

Muhammad Yunus

గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.

READ MORE: South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..

తాజాగా ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ సైతం ఈ అంశంపై స్పందించారు. తప్పుడు కథనాలను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఏకంగా ఐక్యరాజ్య సమితి సహకారాన్ని కోరామన్నారు. ఇటీవల తమ దేశంలో పర్యటించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ దీనిపై సానుకూలంగా స్పందిస్తూ.. హామీ ఇచ్చినట్లు తెలిపారు. “బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం గద్దె ఎక్కినప్పటి నుంచి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఓ వైపు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు ఈ తప్పుడు వార్తల ప్రసారం పెరుగుతోంది. ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయినవారు ఈ వదంతులను ఆయుధాలుగా మలచుకొంటున్నారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. ప్రజలు సైతం గమనిస్తున్నారు. కొందరూ ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. మనందరి ఐక్యత వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” అని తాత్కాలిక అధినేత యూనస్ వెల్లడించారు.

READ MORE: SRH vs LSG: లక్నోలో స్టార్ పేసర్ ఎంట్రీ.. సన్‌రైజర్స్‌ను ఆపేనా! తుది జట్లు ఇవే