Election Polling Starts in Bangladesh: బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశం అంతటా ఆదివారం ఉదయం 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. జనవరి 8 నుంచి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఈ ఎన్నికలను బహిష్కరించింది. బీఎన్‌పీకి ఇతర భావసారూప్యత పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులతో పాటు 436 మంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే.. ఎన్నికలను రద్దు చేస్తామని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) కాజీ హబీబుల్ అవల్ హెచ్చరించారు. ఇక కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ర్ ఎన్నికలను భారత్‌కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.
Also Read: AP News: గుండెపోటుతో తల్లి మృతి.. 5 రోజులుగా మృతదేహంతో ఇంట్లోనే కొడుకు!
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘బంగ్లాదేశ్ సార్వభౌమ, స్వాతంత్ర్య దేశం. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నాను. లేకుంటే.. దేశ అభివృద్ధి సాధ్యం కాదు. 2009- 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లా ఈ స్థాయికి చేరుకుంది’ అని హసీనా అన్నారు. ప్రధాన విపక్షం బీఎన్‌పీ ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో నాలుగోసారీ హసీనా పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.