Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది. అన్ని పవర్ ప్లాంట్లు ట్రిప్ అయ్యాయని, రాజధాని ఢాకా సహా పలు ప్రధాన నగరాల్లో కరెంట్ నిలిచిపోయందని విద్యుత్ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సమస్యను ఇంజనీర్లు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని, సమస్య గుర్తించి పరిష్కరించేందుకు కొన్ని గంటలు పడుతుందని ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని కొన్ని ఆగ్నేయ ప్రాంతాలు మినహాయిస్తే.. దేశం మొత్తం కరెంట్ లేక అంధకారంలోకి వెళ్లిపోయింది. మిగతా దేశం మొత్తం కరెంట్ లేకుండానే ఉన్నదని ఏజెన్సీ ప్రతినిధి షమిమ్ ఎహెసాన్ తెలిపారు. దేశంలో 130 మిలియన్ల పౌరులు కరెంట్ లేకుండానే ఉన్నారని, పవర్ పోవడానికి గల కారణాలు ఏమిటో కూడా తెలియరాలేదని ఆయన వివరించారు. సాంకేతిక లోపం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Read Also: Prabhas: ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. హాజరుకానున్న హీరో ప్రభాస్
ఇటీవలి నెలల్లో బంగ్లాదేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉక్రెయిన్ పై రష్యా దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఎనర్జీ ప్రైసెస్‌తో బంగ్లాదేశ్ ఈ తీవ్ర సమస్యను చవిచూడాల్సి వస్తున్నది. కానీ, దీర్ఘకాలం పవర్ లేకుండా పోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. డిమాండ్ సరిపడా కరెంట్ అందించడానికి దిగుమతి చేసుకునే డీజిల్, గ్యాస్ కోసం డబ్బులు చెల్లించడానికే సతమతం అవుతున్నది. 2014 నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో తీవ్రమైన బ్లాకౌట్ వచ్చింది.
పెరిగిన చమురు ధరల కారణంగా చమురు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో భారీగా తగ్గించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మొత్తానికి అవసరమైన విద్యుత్‌లో 6 శాతం మాత్రమే చమురు ద్వారా ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం అక్కడ గార్మెంట్ పరిశ్రమల్లో కరెంట్ 4 నుంచి 10 గంటలు వరకూ ఉండటం లేదు. ప్రపంచంలోనే బంగ్లాదేశ్ రెండో అతిపెద్ద గార్మెంట్ ఎగుమతి దారుగా ఉంది. అయితే, విద్యుత్ కోతల కారణంగా ఆ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి 7.1 నుంచి 6.6 శాతానికి తగ్గనుందని ఆసియన్ డవలప్‌మెంట్ బ్యాంకు గత నెలలో అంచనా వేసింది.