PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. తాజాగా పుతిన్ విషయంలో మోడీ చర్య భారత, రష్యా బంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రధాని మోడీ తన 11 ఏళ్ల పాలనలో పుతిన్‌తో సహా ఇప్పటి వరకు ఏడుగురు విదేశీ అతిథులను మాత్రమే ఇలా అరుదుగా స్వాగతించారు.
బరాక్ ఒబామా, 2015:
మోడీ తాను ప్రధానిగా ఎన్నికైన ఏడాదిలోనే భారత్‌కు రిపబ్లిక్ డే గెస్ట్‌గా వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించారు. రెండు దేశాల మధ్య మధ్య బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదిరాయి.
షేక్ హసీనా, 2017:
ఏప్రిల్ 2017లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కూడా ఇలాగే స్వయంగా స్వాగతించారు. ప్రస్తుతం, షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది బంగ్లాదేశ్ హింసాత్మక ఆందోళన కారణంగా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు.
షింజో అబే, 2017:
జపాన్, భారత సంబంధాల్లో కొత్త అధ్యాయానికి కారణమైన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబేను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీ రిసీవ్ చేసుకున్నారు. షింజో అబే సమయంలో భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి.
డోనాల్డ్ ట్రంప్, 2020:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు, మోడీ ఆయనను అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 2024:
గతేడాది జనవరిలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచ్చిన యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను భారత ప్రధాని మోడీ స్వాగతించారు.
అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ 2025:
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ విమానాశ్రయంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని స్వాగతించారు.