NTV Telugu Site icon

Bandi Sanjay : మోడీ బియ్యంపై గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. “దళితులకు నిజంగా అండగా నిలిచే పార్టీ ఏదో ప్రజలు ఆలోచించాలి,” అని పిలుపునిచ్చారు.

మోడీ బియ్యం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ బియ్యం పంపిణీకి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు అది సక్రమంగా అందించడంలో విఫలమవుతోందని వ్యాఖ్యానించారు. “మోడీ బియ్యం కోసం ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెళ్లికి వెళ్లి మంగళహారతులు పెట్టినట్టు వ్యవహరిస్తోంది,” అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేతలపై మండిపడుతూ, వీధి నాటకాలు చేసే కళాకారులను మరిచిపోయేలా నటిస్తున్నారు అని విమర్శించారు. ఈ బియ్యం విషయంలో గ్రామగ్రామాన ప్రచారం చేస్తామని, లబ్ధిదారులను కలుసుకుని వారి ఇళ్లలో భోజనం చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో జరిగిన సంఘటనలపై కూడా బండి సంజయ్ స్పందించారు. ABVPకు చెందిన విద్యార్థి రోహిత్‌ను పోలీస్‌లు ఇష్టమొచ్చినట్లు కొట్టారంటూ ఆరోపించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని సంగారెడ్డి జైలుకు పంపించారని, అతను ఓ విద్యార్థి మాత్రమేనని స్పష్టం చేశారు.

“HCU విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి,” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల మీద పగతో వ్యవహరించే ప్రభుత్వం ఎప్పుడూ ముందుకు పోదు అన్నారు. HCU భూముల వ్యవహారంలో గతంలో BRS పాలనలో జరిగిన దాంట్లో బీజేపీకి ఎటువంటి సంబంధం ఉందని భావిస్తే, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలని సవాల్ విసిరారు.

Dokka Manikya Varaprasad: దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన..