NTV Telugu Site icon

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలేమో..!

Ttd

Ttd

Bandi Sanjay: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుతల దాడులు, సంచారం, ఇతర జంతువులు కూడా సంచరిస్తుండడంతో.. భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.. ఇక, అప్రమత్తమైన టీటీడీ.. నడక మార్గంలో చిన్నారులు వెళ్లే సమయాన్ని కుదించింది. దాంతో పాటు.. భక్తులకు కర్రలు పంపిణీ చేస్తోంది.. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో పరిస్థితులు, టీటీడీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన ఆయన.. టీటీడీలో పరిణామాలపై మండిపడ్డారు.

ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని విమర్శించారు సంజయ్‌. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన కలిగిస్తోందన్నారు. భక్తులు తిరుమలకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్‌.. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? అంటూ టీటీడీ చైర్మన్‌ కరుణాకర్‌రెడ్డిపై మండిపడ్డ సంజయ్‌.. ఆయన బిడ్డ పెళ్లి క్రైస్తవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజం కాదా? నేను నాస్తికుడిని అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట.. మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో అని ఎద్దేవా చేశారు.

నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా.. మీరు హిందువులుగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు బండి సంజయ్‌.. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఒక మతానికే కొమ్ము కాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు..? జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండి అంటూ పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌.