Bandi Sanjay: కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల రైతుల ఉద్యమ స్ఫూర్తి కి ఆయన అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ ను తరిమికొట్టేదాకా ఇదే ఉద్యమస్పూర్తిని కొనసాగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయడం హర్షణీయమన్నారు. ఇది రైతు పోరాట విజయంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల రైతులు చూపిన పోరాట స్పూర్తికి మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో తాను స్వయంగా పాల్గొన్నానన్నారు. తనతో పాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు… తమపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదన్నారు.
Read Also: Komatireddy : రేవంత్, ఠాక్రే తో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే
కేసీఆర్ పాలనలో రైతులే కాదు…. సామాన్య, మధ్య తరగతి ప్రజలంతా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాల్జేసి సామాన్యులు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుటుంబ, నియంత పాలనతో రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజార్చారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా మారే దుస్థితి తెలంగాణకు పడుతుందన్నారు. ఈ తరుణంలో కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో కామారెడ్డి, జగిత్యాల జిల్లా రైతాంగం చూపిన తెగువ, పోరాట పటిమ అందరికీ ఆదర్శం. వారి స్పూర్తితో ప్రతి ఒక్కరూ కేసీఆర్ సర్కార్ అవినీతి పాలన అంతమయ్యేదాకా పోరాడాలని బీజేపీ తెలంగాణ పక్షాన మనవి చేసుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు.