Site icon NTV Telugu

Bandi Sanjay : హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది

Bandi Sanjay Fires On Cess

Bandi Sanjay Fires On Cess

భైరీ నరేష్‌ అనే వ్యక్తి అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నరేష్‌పై పోలీస్‌ స్టేషన్లలో అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక వ్యక్తి కోట్లాది హిందువుల మనోభావలను కించ పరిచాడన్నారు. వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వాడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఈ ప్రభుత్వ చేతకానితనమేనని ఆయన అన్నారు. కోట్లాది మంది హిందువులు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి వాడిని పట్టుకునే అవకాశాన్ని పోలీసులు ఇవ్వకూడదని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లనే వాడు ఇంకా బహిరంగంగా తిరుగుతున్నాడని, హిందూ ధర్మాన్ని కించపరచడం, హిందూ దేవతలను దూషించడం ఈ మధ్యకాలంలో కొందరికి ఫ్యాషన్ అయిందన్నారు.

Also Read : Traffic Restrictions : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
అంతేకాకుండా.. ‘ఇట్లాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే రోజుకొకరు రెచ్చిపోయి దేవతలపై కామెంట్స్ చేస్తున్నారు. హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా లేకపోతే హిందువులు ఇంకా ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తుంది. ఇలాంటి నీచమైన వ్యక్తులు రోజుకొకరు పుట్టుకుని వస్తారు. సెక్యులరిజం పేరుతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ని ఉపేక్షిస్తూనే ఉంటాయి. నికార్సైన హిందువు అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాను. కోట్లాది హిందువులు తీవ్ర అవమానానికి గురైతే ఇప్పటిదాకా స్పందించకుండా ఈ సీఎం ఏం ఘన కార్యాన్ని వెలగ బెడుతున్నాడు?. భారతీయులందరం బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి వారసులమని గర్వంగా చెప్పుకుంటాము. డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి పేరుతో నిర్వహించిన సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ మహానుభావుడిని అవమానించినట్లు అవుతుంది. నాస్తికులు దేవుడిని నమ్మకపోవచ్చు అది వారి స్వేచ్ఛ… కానీ వేరే మతాలను కించపరిచే అధికారం ఎవరికి లేదు.

ఒకవేళ ఎవరైనా కొన్ని మతాలను కానీ దేవతలను కానీ కించపరిచేలా మాట్లాడితే వారు శిక్షార్హులు. ఇప్పటిదాకా అయ్యప్ప స్వామిని కించపరిచిన వ్యక్తిని అరెస్టు చేయకపోవడం యావత్ హిందూ సమాజాన్ని అవమానపరిచినట్టే.వాడు గతంలో కూడా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఆ రోజే అరెస్టు చేసి జైల్లో పెట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. అందుకే ఇంతటి దుర్ఘటన జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మంను ఒక రకంగాను, ఇతర మతాలకు ఇంకో రకంగా చూస్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version