Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్‌ అరెస్ట్‌పై పోలీసుల అధికారిక ప్రకటన

Bandi Sai Bhagirath

Bandi Sai Bhagirath

Bandi Sai Bhagirath Arrest: బండి భగీరథ్‌ నిన్న పోలీసులు ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, భగీరథ్‌ తండ్రి సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు మరో ప్రకటన విడుదల చేశారు. పేటబషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్‌‌ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. పోలీసుల ప్రకారం.. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2026 మే 8న పేటబషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి సాయి భగీరథ్‌ అలియాస్ భగీరథ్‌పై కేసు నమోదు చేశారు. ప్రారంభ దర్యాప్తులో బాధితురాలు, ఇతర సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసులోని చట్ట విభాగాలను మారుస్తూ బీఎన్ఎస్ చట్టంలోని 64(2)(ఎం) సెక్షన్‌తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 5(1) R/W 6లను జోడించారు. ఈ కేసు దర్యాప్తును కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో కొనసాగించారు. అదేవిధంగా బాధితురాలి స్టేట్మెంట్‌ను మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు.

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అతడు తరచుగా వెళ్లే పరిచయస్తుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అలాగే నిందితుడిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నమ్మకమైన సమాచారంతో నిందితుడు పోలీస్ అకాడమీ సమీపంలో సంచరిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఈ క్రమంలో మే 16, 2026 సాయంత్రం 8.15 గంటలకు నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ సమీపంలో సైబరాబాద్ ఎస్‌ఓటీ బృందం భగీరథ్‌ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని పేటబషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో పంచుల సమక్షంలో విచారణ జరిపినప్పుడు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, అతడిని న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.