Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!

  • బండి భగీరథ్‌పై పోక్సో కేసు
  • పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం
  • సోషల్ మీడియా పోస్టుల కేసులో సిట్ ఏర్పాటు
Bandi Bhageerath

Bandi Bhageerath

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ కేసులో భగీరథ్ కోసం పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపట్టగా.. అతడు పోలీసుల ముందు లొంగిపోయాడు. తాజాగా భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బండి భగీరథ్ పోక్సో వ్యవహారానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టుల కేసులో హైదరాబాద్ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులు, దుష్ప్రచారాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కేసు దర్యాప్తు కోసం జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన పోస్టులు, వాటి మూలాలు, ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలు, కుట్ర కోణం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది. విచారణలో భాగంగా.. బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సంబంధిత జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు గుర్తించారు. ఈ ప్రచారంపై హైకోర్టు రిజిస్ట్రార్ మే 16న చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును చార్మినార్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా సిట్ ఏర్పాటు కావడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగంగా సాగనున్నట్లు తెలుస్తోంది.