Balineni Srinivas Reddy: ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకోవటం వల్ల ఆలస్యం అయ్యిందని బాలినేని మండిపడ్డారు. పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి వైదొలగాలని నిశ్ఛయించుకున్నా.. కానీ సీఎం జగన్ దయతో అది సాధ్యమైందన్నారు.
Read Also: Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదం వెనుక రాజకీయ కుట్ర.. గంటా సంచలన వ్యాఖ్యలు
మౌళిక సదుపాయాల కల్పన పూర్తిచేసి వచ్చే నెల 10వ తేదీ లోపు సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఓ నిర్ణయం తీసుకున్నానన్న మాజీ మంత్రి బాలినేని.. 25 వేలమందికి పట్టాలు ఇవ్వటమే కాదు.. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేస్తా.. రెండు ప్రాంతాలు రెండు సిటీల్లా రూపుదిద్దుకుంటాయన్నారు. ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని భగవంతుడ్ని.. మా సీఎంను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. మాగుంటకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నా.. ఆయన కూడా 30 ఏళ్ల నుంచి మాతోనే ఉన్నారని బాలినేని తెలిపారు. ఎవరు సపోర్ట్ చేసినా.. చేయకున్నా వైపాలెం అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత నాది.. గెలిపించుకుని వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి సురేష్ కూడా సపోర్ట్ చేస్తారు.. ఆయన సపోర్ట్ చేయనని చెప్పలేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. సామరస్యంగా జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం.. అభ్యర్దులందరిని గెలిపించుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.