అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై ‘బాలక్ రామ్’ గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
Read Also: Tamil Nadu: ఓ విద్యార్థికి జ్యూస్లో కలిపి మూత్రం తాగించిన ఇద్దరు విద్యార్థులు.. ఏడాదిపాటు సస్పెండ్
ఇదిలా ఉంటే.. ప్రాణప్రతిష్ట పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్నందిని శరణ్ తెలిపారు. ప్రతిరోజూ మంగళ (నిద్ర లేపేందుకు), శ్రింగార (అలంకరణ సేవలో), భోగ (నైవేద్య సమర్పణ వేళ), ఉతపన్ (దిష్టి తగలకుండా), సంధ్యా (సాయంత్రం వేళ), శయన హారతి(స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు) ఇస్తామని చెప్పారు.
Read Also: Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేయని మరో విగ్రహాన్ని చూశారా..?
ఇక స్వామివారికి పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. కాగా.. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో ‘బాలక్ రామ్’ దర్శనం ఇవ్వనున్నారు. మరోవైపు.. ఈరోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.