Balakrishna: ‘అఖండ 2’ ఘన విజయోత్సవ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రసంగం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా పండుగకు విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, టీవీల ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. ఆయన భగవద్గీత, వేదాలు, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ప్రస్తావించారు. ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుంది.. కొందరిని భగవంతుడే ఒక ప్రత్యేక కార్యానికి ఎంచుకుంటాడు అంటూ.. ధర్మం, కర్తవ్యంపై తన ఆలోచనలను వెల్లడించారు. ‘అఖండ 2’ సినిమాను తీసిన ఉద్దేశం ప్రేక్షకులు జీవితంలో ఆచరించాలని ఆయన కోరారు.
SS Thaman: తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తాకింది.. తమన్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి తారకరామారావుని స్మరించుకుంటూ.. తనకు లభించిన ఈ జన్మ, ఈ గుర్తింపు అన్నీ ఆయన ఆశీస్సులేనని పేర్కొన్నారు. అలాగే తన గురువులు, రచయితలు, సంగీత దర్శకులు, దర్శకులు సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అఖండ 2′ సినిమా కేవలం ఒక సినిమా కాదని, ఇది సనాతన హైందవ ధర్మం శక్తి, గర్వం, పరాక్రమాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నమని బాలకృష్ణ అన్నారు. పిల్లలకు, యువతకు తమ మూలాలు, భారతీయ సంస్కృతి, ధర్మం గురించి తెలియజేయాలన్నదే ఈ సినిమా లక్ష్యమని వివరించారు. “ధర్మం దారిలో నడవాలి.. అన్యాయం జరిగితే తలదించకూడదు” అనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని స్పష్టం చేశారు.
కోవిడ్ కాలంలో విడుదలైనప్పటికీ ‘అఖండ’ అద్భుత విజయం సాధించడం భగవంతుడి దయ, ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. ఆ తర్వాత వచ్చిన తన చిత్రాలన్నీ విజయవంతం కావడం తన వ్యక్తిగత విజయం కాదని.. ఇది చిత్రబృందం, ప్రేక్షకుల సమిష్టి విజయమని పేర్కొన్నారు. ఇక ప్రసంగం చివర్లో మరోసారి ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇలాంటి విలువలతో కూడిన సినిమాలు మరిన్ని తీసుకురావాలని తమ ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు. అఖండ 2 ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ ఆయన చేసిన నినాదాలతో సభా ప్రాంగణం ‘జై బాలయ్య, జై అఖండ’ నినాదాలతో మార్మోగింది.