మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ కోసం ఇద్దరు టీమిండియా స్టార్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరికి కెప్టెన్సీ అప్పగించాలో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న అక్షర్‌కే సారథ్యం దక్కే అవకాశాలున్నాయని ప్రాంచైజీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ త్వరలోనే కెప్టెన్ పేరును వెల్లడించనుంది. ఐపీఎల్‌లో అక్షర్ ఇప్పటివరకు కెప్టెన్సీ చేయని విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ తరఫున చాల ఏళ్లుగా ఆడుతున్నాడు. ఢిల్లీకి ఏడో సీజన్ ఆడబోతున్న అక్షర్.. 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 123 వికెట్లు, 1653 పరుగులు చేశాడు.
Also Read: WPL 2025 Final: బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్.. ఫైనల్ వెళ్లేందుకు ముంబైకి ఛాన్స్!
లోకేష్ రాహుల్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. లక్నో తరఫున సక్సెస్ కూడా అయ్యాడు. ఇప్పటివరకు 132 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4683 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో 500 ప్లస్ పరుగులు చేశాడు. అయితే రాహుల్ ఢిల్లీ తరఫున ఆడడం ఇదే మొదటిసారి. ఇటీవలి రోజుల్లో అక్షర్, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంతో ఇద్దరి పాత్ర ఉంది. చూడాలి మరి ఢిల్లీ కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ లక్నో జట్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.