అదృష్టవంతులకు అవకాశాలు అందివస్తాయని అంటారు. నటశేఖర కృష్ణకు అలాగే యాక్షన్ మూవీస్ లోని పలు జానర్స్ లో ఛాన్సులు దక్కాయి. మూడో సినిమా ‘గూఢచారి 116’లోనే సీక్రెట్ ఏజెంట్ గా నటించి ఆకట్టుకున్న కృష్ణకు మరుసటి ఏడే ‘అవేకళ్ళు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించే అవకాశం చిక్కింది. పైగా పూర్తి రంగుల్లో రూపొందిన తొలి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అవేకళ్ళు’ జేజేలు అందుకుంది. 1967 డిసెంబర్ 14న విడుదలైన ఈ రంగుల చిత్రం విశేషాదరణ చూరగొంది.
‘అవేకళ్ళు’ కథలోకి తొంగిచూస్తే… రాజశేఖరం, చంద్రం అన్నదమ్ములు. వారి పెద్దన్నయ్య ఓ యాక్సిడెంట్ లో మరణించి ఉంటాడు. రెండో అన్నయ్యను ఎవరో చంపేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తారు. ఆ హత్యచూసిన ఆయన భార్యనూ చంపబోతారు. ఆమెకు మతిభ్రమించి ఉంటుంది. అదే సమయంలో రాజశేఖరం అన్న కూతురు సుశీల, తన ఫ్రెండ్స్ తో క్రిస్మస్ సెలవులకు సంఘసేవ చేయడానికి వస్తుంది. వారందరికీ చంపేస్తామన్న ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అందరూ ఆ ఇంట్లో ఉండడానికే భయపడుతూ ఉంటారు. సుశీలకు హోటల్ లో పనిచేసే భాస్కర్ తో పరిచయం అవుతుంది. అతను కూడా వారి ఇంట్లోకి వెళతాడు. అక్కడ జరిగే సంఘటనలు గమనిస్తాడు. అందరినీ అనుమానిస్తాడు. అతని మిత్రుడు నిత్యానందం కూడా భాస్కర్ కు సాయం చేస్తూంటాడు. అందరూ ఆ ఇంటిలోనే ఉంటూ హంతకుని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూంటారు. ఈ లోగా హంతకుడు, చంద్రాన్ని చంపేస్తాడు. సుశీలను కూడా చంపాలని హంతకుడు ప్రయత్నిస్తాడు.
అతడు నల్లని దుస్తులు వేసుకొని, ముసుగు వేసుకొని వస్తాడు. అతనితో భాస్కర్ తలపడతాడు. ఆ పోరాటంలో అతని కళ్ళు మాత్రమే గుర్తుంచుకోగలుగుతాడు భాస్కర్. ఆ తరువాత ఇంట్లో వాళ్ళందరినీ నుంచో బెట్టి ముసుగుపెట్టి రాజశేఖరం, వారింటి డాక్టర్, వారితో పాటే ఉండే ఓ ముదుసలిని పరీక్షిస్తాడు. ఆ ముసలివాడే అసలు దోషి అని తేలుస్తాడు. అప్పుడు ముసలివాడుగా నటిస్తున్నవాడు అసలు రూపం చూపించి, ఎందుకు తాను హత్యలు చేస్తున్నాడో చెబుతాడు. రాజశేఖరం తండ్రే తనకూ తండ్రి అని, కానీ, అందరూ కలసి తన తల్లిని సజీవదహనం చేశారని, అందువల్లే పగపట్టి అందరినీ మట్టుపెడుతున్నానని వివరిస్తాడు. రాజశేఖరంను, సుశీలను చంపాలని చూస్తాడు. భాస్కర్ తప్పిస్తాడు. అతనితో భాస్కర్ పోరాటం చేస్తాడు. తప్పించుకు పారిపోతూండగా, పోలీసుల తుపాకి గుళ్ళకు బలవుతాడు హంతకుడు. తన రహస్య స్థావరంలో కన్నుమూసి ఉంటాడతడు. చివరకు భాస్కర్ ఓ సి.ఐ.డి. ఆఫీసర్ అన్న సత్యాన్ని పోలీసాఫీసర్ చెబుతాడు. హత్యల ఆచూకీ కోసమే భాస్కర్ ప్రత్యేకంగా వచ్చాడని తెలుస్తుంది. భాస్కర్, సుశీల పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో కృష్ణ, కాంచన, పద్మనాభం, రమణారెడ్డి, రాజనాల, రామదాసు సురేంద్రనాథ్, గుమ్మడి, అతిథి పాత్రలో నాగభూషణం నటించగా, గీతాంజలి, పుష్పకుమారి, నిర్మల, కనకం, విజయశ్రీ, రేణుక, సాధన, లక్ష్మి కూడా ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి డి.వి.నరసరాజు మాటలు రాయగా, దాశరథి, కొసరాజు పాటలు సమకూర్చారు. వేదా స్వరకల్పన చేశారు. ఇందులోని “మావూళ్ళో ఒక పడుచుంది…”, “డుమ్ డుమ్ గంగిరెద్దు…”, “చక్కని పార్కు..”, “చెలిమి చెంతకు పిలుచుకో…”, “ఎవరు నీవారు…”, “ముద్దులొలుకు చిన్నది…”, “ఓహ్ ఏనాటి అందం…”, “ఓ ప్రియతమా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఏవీయమ్ సంస్థాధినేత ఎ.వి.మెయ్యప్పన్ తనకు నచ్చిన కథను మరోమాట లేకుండా అనుకున్న విధంగా నిర్మించేవారు. అందుకు తమిళ, తెలుగు, హిందీ చిత్రసీమలను వేదికగా ఎంచుకొనేవారు. అలా పలు సూపర్ హిట్స్ నిర్మించిన మెయ్యప్పన్ ‘అవేకళ్ళు’ కథతో ఒకే సమయంలో తెలుగు, తమిళ చిత్రాలు ఆరంభించారు. తమిళంలో రవిచంద్రన్, కాంచన జంటగా, తెలుగులో కృష్ణ, కాంచన జోడీగా నటించారు. రెండూ పూర్తి స్థాయి రంగుల చిత్రాలే! కొత్తవారితో సాహసం చేస్తున్నారని మెయ్యప్పన్ ను కొందరు సన్నిహితులు హెచ్చరించినా, తన దర్శకుడు ఏ.సి.త్రిలోక్ చందర్ రూపొందించిన కథ తప్పకుండా జనాన్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఆయన ముందడుగు వేశారు. ఈ కథతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అదే కంగల్’ 1967 మే 26న విడుదలై మంచి ఆదరణ పొందింది. తరువాత ఏడు నెలలకు తెలుగులో ఈ ‘అవేకళ్ళు’ సినిమాను విడుదల చేశారు. ఇక్కడా మంచి ఆదరణ పొందిందీ కథ. నిజానికి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో అసలు దోషి ఎవరో ముగింపులో తెలుస్తుంది. చూసే ప్రేక్షకుడు ‘అరె…’ అనుకొనేలా కథలు ఉంటాయి. ఒక్కసారి సస్పెన్స్ విడిపోయాక మళ్ళీ ఆ చిత్రంవైపు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటప్పుడే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించాలి. సినిమాలో బలమైన కథనం ఉండాలి. ఆకట్టుకొనే సన్నివేశాలు చొప్పించాలి. ముఖ్యంగా నాయిక పాత్రధారి అందచందాలతో ఆకట్టుకోవాలి. అన్నిటినీ మించి సదరు చిత్రాల్లో అలరించే సంగీతం ఉంటే ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే ఏ.సి.త్రిలోక్ చందర్ ‘అవేకళ్ళు’ రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ఫలితం సాధించారు. వినసొంపైన పాటలు ఉండడంతో ఈ సినిమా రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ పొందింది.