NTV Telugu Site icon

AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. భారత్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!

Team India Test

Team India Test

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడమే కాకుండా.. వైట్ వాష్ ఇవ్వడంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కివీస్ టెస్ట్ సిరీస్ ఘోర వైఫల్యం నేప‌థ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దిద్దుబాటు చ‌ర్య‌లకు దిగింది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను వారం ముందుగానే కంగారో గడ్డపైకి పంపనుంది.

న్యూజిలాండ్‌ సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆడిన కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 12 రన్స్ చేశాడు. గిల్ అందుబాటులోకి రావడం, పేలవ ఫామ్ కారణంగా.. మిగితా రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024కి ఎంపికైన రాహుల్.. ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అడ‌గుపెట్ట‌నున్నాడు. నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో రాహుల్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడిన రాహుల్.. 187 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

Also Read: Virat Kohli Birthday: 2006లో చిన్న పిల్లాడు.. ఇప్పుడు క్రికెట్‌ దిగ్గజం!

యువ వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురెల్‌ తొలిసారి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌నకు వెళ్లనున్నాడు. విదేశీ గ‌డ్డ‌పై ఆడిన అనుభ‌వం జురెల్‌కు లేకపోవడంతో అక్క‌డి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే ఆస్ట్రేలియాకు పంపిస్తోంది. జురెల్‌ కూడా ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న రెండో టెస్టులో ఆడనున్నాడని తెలుస్తోంది. నవంబ‌ర్ 22 నుంచి పెర్త్ వేదిక‌గా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.