AP Election Alliance: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తున్నా.. వారితో బీజేపీ నడుస్తుందా? లేదా? అనేది తేలేది క్లైమాక్స్ చేరుకున్నట్టు తెలుస్తోంది.. ఈ తరుణంలో.. పొత్తులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఇద్దరు నేతలు.. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. ఇక, చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్తున్నారు.. ఢిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందన్నారు అచ్చెన్నాయుడు.. మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నాం.. మా పొత్తుల్ని విచ్ఛిన్నం చేయటానికి కొందరు చేసిన తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయంటూ హాట్ కామెంట్లుచేశారు నాదెండ్ల మనోహర్.
ఇక, చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలి.. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్.. సూపర్ 6 నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన టీంలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే విఫలం అవుతుందని హెచ్చరించారు నాదెండ్ల మనోహర్.
మరోవైపు.. ఈ నెల 17న తెలుగుదేశం -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం అని తెలిపారు అచ్చెన్నాయుడు.. ఈ నెల 17న చిలకలూరిపేటలో తెలుగుదేశం – జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందన్న ఆయన.. చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మా సభకు బస్సులు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల తీరు మారకుంటే న్యాయపరంగా మయందుకెళ్తాం. తెలుగుదేశం – జనసేన నేతలపై వేధింపులు మానుకోవానలి సూచించారు. ఇక, పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాలన్నదే తెలుగుదేశం – జనసేన లక్ష్యం.. తెలుగుదేశం – జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైసీపీ వణికిపోతోందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.