క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్ 2025 నేటి నుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆసియా జట్లు సిద్ధం కావడానికి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ Bలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్ ఉన్నాయి. ఆసియా కప్ నేపథ్యంలో ఈ టోర్నమెంట్‌లో (టీ20 ఫార్మాట్‌లో) నమోదైన టాప్ 5 రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్:
ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేశారు. 2022 సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 2016 ఆసియా కప్ క్వాలిఫైయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన బాబర్ హయత్ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 122 పరుగులు బాదాడు.
5 వికెట్లు తీసిన బౌలర్:
ఆసియా కప్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. సెప్టెంబర్ 2022లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసిన మ్యాచ్ కూడా ఇదే. 2022లో పాకిస్థాన్‌పై భువనేశ్వర్ 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నబీ, లసిత్ మలింగ, ప్రమోద్ మధుషన్, ఆమిర్ కలీమ్ టీ20 ఆసియా కప్‌లో 4 వికెట్స్ (4-4) పడగొట్టారు.
200+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్:
టీ20 ఆసియా కప్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ 200 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్‌లలో 429 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొహమ్మద్ రిజ్వాన్ 281 పరుగులు (1 అర్ధ సెంచరీ)తో రెండవ స్థానంలో.. రోహిత్ శర్మ 271 పరుగులతో (2 అర్ధ సెంచరీ) మూడవ స్థానంలో.. బాబర్ హయత్ 235 పరుగులతో నాల్గవ స్థానంలో ఉన్నాడు.
Also Read: Rohit Sharma: అర్ధరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. వీడియో వైరల్! ఆందోళనలో ఫాన్స్
10+ వికెట్లు:
టీ20 ఆసియా కప్‌లో 6 మంది బౌలర్లు 10 కంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు. అమ్జాద్ జావేద్ 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టగా.. అల్-అమీన్ హుస్సేన్, మహ్మద్ నవేద్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ 11 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
100+ భాగస్వామ్యాలు:
ఆసియా కప్‌లో నాలుగు సార్లు 100+ పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 2022లో దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై మొదటి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. అదే సంవత్సరం షార్జాలో ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ హాంకాంగ్‌పై రెండవ వికెట్‌కు 116 పరుగులు చేశారు. 2016లో మిర్పూర్‌లో షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ కలిసి యూఏఈపై నాల్గవ వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2016లో దినేష్ చండిమల్, తిలకరత్నే దిల్షాన్ జోడి పాకిస్తాన్‌పై మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించారు.
