NTV Telugu Site icon

Asia Cup 2023: ఫైనల్‌లో ఒక్కసారి కూడా ఢీకొట్టని భారత్-పాకిస్తాన్.. ఆసియా కప్ ఆసక్తికర విషయాలు ఇవే!

Ind Vs Pak

Ind Vs Pak

Asia Cup Stats Table and List of Asia Cup Cricket Records: ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు ఉండగా.. పాక్‌లో 4, శ్రీలంకలో 9 జరగనున్నాయి.

హైబ్రీడ్ మోడల్‌:
ఆసియా కప్ 2023లో 6 జట్లను 2 వేర్వేరు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్ల ఉన్నాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ‘సూపర్ ఫోర్’ ఆడుతాయి. సూపర్ ఫోర్‌లో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్ ఫోర్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడుతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు ఆసియా కప్ 2023 టైటిల్ అందుకుంటుంది.

16వ ఎడిషన్‌:
1984లో యూఏఈ గడ్డపై తొలిసారిగా ఆసియా కప్‌ జరిగింది. ఆ సీజన్‌లో భారత్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరుగనుంది ఆసియా కప్‌ 16వ ఎడిషన్‌. ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి మాత్రమే. 2008 ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగ్గా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఈసారి శ్రీలంకలో కూడా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఇప్పటివరకు భారత్ ఒక్కసారి మాత్రమే ఆసియా కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. అత్యధిక సార్లు బంగ్లాదేశ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది.

ఒక్కసారి కూడా:
క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద జట్లు అయిన భారత్, పాకిస్థాన్.. ఒక్కసారి కూడా ఆసియా కప్ ఫైనల్‌లో తలపడలేదు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు ఏకంగా 8 సార్లు తలపడ్డాయి. అయితే ఈసారి భారత్ సహా పాకిస్తాన్ కూడా పటిష్టంగా ఉంది. అదే సమయంలో శ్రీలంక పరిస్థితి ఏమంత బాలేదు. బంగ్లా, అఫ్గాన్, నేపాల్ జట్లు ఉన్నా.. పెద్ద జట్లకు షాక్ ఇచ్చేంత సీన్ లేదు. దాంతో ఈసారి ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Male and Female Genitalia: పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్లగా.. పురుష, స్త్రీ జననాంగాలున్నాయని షాక్ ఇచ్చిన వైద్యులు!

భారత్ 7 సార్లు:
ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు భారత్ టైటిల్స్ గెలుచుకుంది.1984, 1988, 1991,1995, 2010, 2016, 2018 సంవత్సరాల్లో ఆసియా కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. శ్రీలంక 6 సార్లు (1986, 1997, 2004, 2008, 2014, 2022) ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక 2000, 2012లో పాకిస్తాన్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

 

Show comments