Site icon NTV Telugu

Asia Cup 2025: ఆసియా కప్‌ టైటిల్‌ ఫేవరెట్‌ భారత్.. కానీ..!

Asia Cup 2025

Asia Cup 2025

ఆసియా కప్‌ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌ అఫ్గానిస్థాన్‌, హాంకాంగ్‌ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్‌ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్‌ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్‌ ఫర్వేజ్‌ మహరూఫ్‌ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్‌ టైటిల్‌ ఫేవరెట్‌ భారత్ అని చెప్పాడు. అయితే టీ20ల్లో ఏమైనా జరగొచ్చని.. శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కూడా టైటిల్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

తాజాగా ఫర్వేజ్‌ మహరూఫ్‌ మాట్లాడుతూ… ‘ఆసియా కప్‌ 2025 ఫేవరెట్‌ భారత్ అని నేను అనుకుంటున్నాను. అండర్ డాగ్స్ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు టైటిల్ గెలిచే అవకాశం ఉంది. భారత్ జట్టు బలంగా ఉంది. అయితే ఇది టీ20 క్రికెట్‌. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. పెద్ద టోర్నమెంట్లలో తనదైన రోజున ఏ టీమ్ అయినా రేచిపోవచ్చు. అందుకే ఎవరైనా ఛాంపియన్‌గా అవతరించొచ్చు’ అని చెప్పాడు. భారత్ అత్యధికంగా 8 సార్లు ఆసియా కప్‌ గెలుచుకుంది. శ్రీలంక ఆరుసార్లు కప్‌ను సొంతం చేసుకోగా.. బంగ్లాదేశ్‌ ఒక్కసారి కూడా గెలవలేదు. బంగ్లా 2012, 2016, 2018లో ఫైనల్స్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది.

Also Read: Dog Bite: కుక్క కరిచిన ఆరు నెలల తర్వాత లక్షణాలు.. ఆ తర్వాత యువకుడికి ఏమైందంటే?

సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యుఎఇతో జరిగే మ్యాచ్‌లో భారత్ తన గ్రూప్ ఎ పోరును ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 14న అదే వేదికపై పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 19న అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడుతుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండటం టీమిండియాకు అదనపు బలం. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా లతో పేస్ విభాగం బలంగా ఉంది. శివం దుబే కూడా మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.

Exit mobile version