Site icon NTV Telugu

Asia Cup 2025: కరచాలనం సరే.. ఛాంపియన్ అయ్యాక భారత్ ట్రోఫీ తీసుకుంటుందా?

Mohsin Naqvi Bcci

Mohsin Naqvi Bcci

యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్‌ అనంతరం పాకిస్థాన్‌ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్‌ చేసింది. ఒకవేళ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించింది.

కరచాలనం ఘటనపై ఆసియా క్రికెట్‌ సంఘం (ఏసీసీ)కు పీసీబీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియని ఏసీసీ.. ఐసీసీ జోక్యాన్ని కోరుతోంది. పీసీబీ బాస్ మొహ్‌సిన్‌ నఖ్వి (పాకిస్థాన్‌)నే ఏసీసీ అధ్యక్షుడు కావడం, ఐసీసీకి అధ్యక్షుడు జై షా (భారత్) కావడం ఇక్కడ విశేషం. ఇది ఐసీసీ ఈవెంట్‌ కాదు కాబట్టి జై షా చేతిలో ఏమీ ఉండదు. ఇక్కడ మొహ్‌సిన్‌ నఖ్విదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా టోర్నీలో ఇక పైనా కూడా పాకిస్థాన్‌ క్రికెటర్లతో కరచాలనం చేయొద్దని భారత్ నిర్ణయించింది. దాంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Team India: ఒమన్‌పై యూఏఈ విజయం.. సూపర్‌-4లో భారత్‌!

ఆసియా కప్‌ 2025లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-4లో చోటు దక్కించుకుంది. ఫైనల్ చేరడం కూడా టీమిండియాకు పెద్ద విషయం కాదు. గ్రూప్‌-ఎ నుంచి పాక్ కూడా సూపర్‌-4కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక దాదాపుగా చోటు ఖాయం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లలో ఓ జట్టు సూపర్‌-4కు చేరనుంది. భారత్ ఫామ్ చూస్తే.. ఫైనల్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్ అయితే.. పీసీబీ బాస్ మొహ్‌సిన్‌ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుంది. మరి కరచాలనం చేయకూడని నిర్ణయం తీసుకున్న భారత్.. పీసీబీ అధ్యక్షుడి చేతుల మీదుగా టోర్నీ ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే అందరి మెదడుని తెలుస్తున్న పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Exit mobile version