ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా టీమిండియాను హెచ్చరించారు. పాక్ బౌలింగ్ ఎప్పుడూ ప్రమాదకరమే అని, దాయాది జట్టును అస్సలు తేలికగా తీసుకోవద్దని చెప్పారు.
‘గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడడం లేదు. జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ.. ఓ యూనిట్‌గా రాణించడం లేదు. అయినప్పటికీ పాక్ ఎల్లప్పుడూ ప్రమాదకరమైన జట్టే. పొట్టి ఫార్మాట్‌లో ఏ జట్టును తేలికగా తీసుకోలేం. నాణ్యత పరంగా చూస్తే భారత్ కంటే పాకిస్థాన్ చాలా దిగువలో ఉంది. అయినా కూడా దాయాది టీమ్ ఇప్పటికీ ప్రమాదకరమైన జట్టు. పాకిస్థాన్‌లో ఎల్లప్పుడూ నాణ్యమైన బౌలర్లు ఉంటారు. వారి బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగించేదే. ఆసియా కప్ 2025లో కూడా పాక్ బ్యాటింగ్ విభాగంలో సమస్యలు ఎదుర్కొంటోంది. బౌలింగ్ మాత్రం పటిష్టంగా ఉంది. అండర్ డాగ్స్ పాకిస్థాన్‌ను తేలికగా తీసుకోలేం’ అని దీప్ దాస్‌గుప్తా సూచించారు.
Also Read: Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!
‘ఆసియా కప్ 2025లో భారత జట్టుకు ఇంకా సవాళ్లు ఎదురుకాలేదు. సూపర్-4లో మనకు పోటీ ఎదురుకానుంది. పాకిస్థాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంకలను ఢీకొట్టాల్సి ఉంది. ఇప్పటివరకు భారత్ ప్రదర్శన బాగానే ఉంది, లోపాలు చెప్పడానికి ఏమీ లేదు. దుబాయ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనే నిర్ణయం మంచిదే. దుబాయ్ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. మణికట్టు స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు. అన్ని ఫార్మాట్లలో వారు జట్టుకు అవసరం’ అని దీప్ దాస్‌గుప్తా చెప్పుకొచ్చారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బరిలోకి దిగనున్నారు.
