Ashwin Questions Gambhir: మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో T20 లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను, జట్టు యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ రికార్డును బట్టి చూస్తే జస్ప్రీత్ బుమ్రా తర్వాత తను ఫాస్ట్ బౌలర్‌గా రెండవ ఎంపికగా ఉండాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అర్ష్‌దీప్ వంటి ప్లేయర్‌ను విస్మరించడం అన్యాయమని ఈ మాజీ స్పిన్నర్ పేర్కొన్నాడు.
READ ALSO: Kavitha : ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని
మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో T20 లో భారత్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించాలనే లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సులభంగా సాధించింది. కాన్‌బెర్రాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి T20 వర్షం కారణంగా రద్దయింది. ఈ సందర్భంగా అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. “బుమ్రా ఆడుతుంటే, అర్ష్‌దీప్ సింగ్ మీ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉండాలి” అని జట్టు యాజమాన్యంతో అన్నారు. “బుమ్రా ఆడకపోతే, అర్ష్‌దీప్ ఆ జట్టులో మొదటి ఫాస్ట్ బౌలర్ ఎంపిక అవుతాడు. ఈ జట్టులోని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌ను ఎందుకు తప్పించారో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా నా అవగాహనకు మించినది.” అని ఆయన అభిప్రాయడ్డారు.
“హర్షిత్ రాణా బాగా బ్యాటింగ్ చేశాడు, కానీ నేను అతని గురించి ప్రస్తావించడం లేదు. నా ఉద్దేశ్యం అర్ష్‌దీప్ సింగ్‌కు సంబంధించినది. అతను 2024 టీ20 ప్రపంచ కప్‌లో బాగా రాణించాడు. కానీ అప్పటి నుంచి టీంలో అతన్ని పక్కన పెట్టారు. ఇది అతని లయకు కొంత అంతరాయం కలిగించింది” అని అశ్విన్ చెప్పాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ , కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నప్పుడు అర్ష్ దీప్ T20 క్రికెట్ జట్టులో భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడని అర్ష్ దీప్ సింగ్ అభిమానులు చెబుతున్నారు.
READ ALSO: LPG Gas Price: గుడ్ న్యూస్.. నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి.. కొత్త రేట్లు ఎంతో తెలుసా!