Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. దీంతో కాలుష్య నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వాహనాలపై ఆంక్షలు విధించింది. కానీ, ఇప్పుడు మరో విషయం దేశ ప్రజలను కలవర పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ గాలి కాలుష్యం ఎక్కువైపోయింది. ఇది ఎంతమేర అంటే ఏకంగా గాలినాణ్యత ఢిల్లీని మించి పడిపోయింది. ముంబైలో గాలి నాణ్యత 315పాయింట్ల తీవ్ర స్థాయికి తగ్గిపోయింది.
గాలి కాలుష్యం అనేది ముంబైలో ఢిల్లీ కంటే తీవ్రపరిస్థితికి చేరినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఉపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంతేకాదు ఆస్తమాతో బాధపడే పిల్లలను మాస్క్‌లను తరచూ మార్చుకోవాలని చెబుతున్నారు. ఆరుబయట ఆడుకునేటప్పుడు ఇన్‌హేలర్ అందుబాటులో పెట్టుకోవాలని అని డాక్టర్లు ప్రకటించారు. గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోవడంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇది చలికాలం కావడంతో చాలామంది శ్వాససంబంధ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు జలుబు, దగ్గు నుంచి కోలుకునేందుకు కొందరికి రెండు వారాలపైనే పడుతోంది.