ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బహిరంగంగా ప్రశంసించారు. ఒక వైపు, కేజ్రీవాల్ నితిన్ గడ్కరీని మెచ్చుకుంటూ.. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వచ్ఛమైన సిద్ధాంతం గల నాయకుడని అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతిపరులని తరచూ చెప్పే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ఈ విధంగా పొగిడటం చాలా అరుదు.
READ MORE: George Soros: జార్జ్ సోరోస్‌కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలపై చర్చించారు. బీజేపీకి చెందిన ఏ నాయకుడు బాగా పని చేస్తారు అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించగా.. దీనిపై ఆప్ అధినేత సమాధానమిచ్చారు. “నాకు నితిన్ గడ్కరీ అంటే ఇష్టం. ఆయన బాగా పని చేస్తారు. దేశంలో ఆయన ఎన్నోపనులు చేశారు.” అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా… మోడీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. దేశంలో ఎన్నో మంచి హైవేలు నిర్మించడం వల్ల ఆయనకు ‘హైవే మ్యాన్’ అనే పేరు కూడా వచ్చింది. పలువురు విపక్ష నేతలు కూడా ఆయన పనిని మెచ్చుకున్నారు. తాజాగా ఆప్ అధినేత కూడా ప్రశంసించారు.
READ MORE: Tollywood 2024 : టాలీవుడ్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు వీరే
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరుగా మారనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2013 డిసెంబర్ నుంచి ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో పాలన సాగిస్తోంది. అయితే, గత ఏడాది సెప్టెంబర్ లో అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఆరోపణల నేపథ్యంలో తన స్థానంలో అతిషికి సీఎం పదవిని కట్టబెట్టారు.