బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. మరోవైపు తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీలో అడుగుపెట్టిన ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
భారత్‌కు ఘనమైన రికార్డు
టెస్టు క్రికెట్‌లో అరుణ్‌జైట్లీ స్టేడియం భారత జట్టుకు కంచుకోట లాంటిది. ఈ వేదికలో 1987 నుంచి ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోకపోవడం విశేషం. ఇక్క దాదాపు 36 ఏళ్ల నుంచి ప్రత్యర్ధి జట్లపై భారత్ పూర్తి అధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గత 36 ఏళ్లలో కేవలం రెండు టెస్టులు మాత్రమే డ్రాగా ముగిశాయి. ఇదే వేదికపై ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి మేటి జట్లను భారత్ చిత్తు చేసింది. చివరగా 1987లో వెస్టిండీస్ చేతిలో మాత్రం ఓడిపోయింది.
ఈ వేదికలో ఇప్పటివరకు 36 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 6 సందర్భాల్లో విజయం సాధించింది, సెకెండ్ బ్యాటింగ్ జట్టు 13 సార్లు గెలిపొందింది. మిగితా 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఓవరాల్‌గా భారత్ 34 టెస్టులు ఆడగా.. అందులో 13 మ్యాచ్‌లు గెలుపొందింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఢిల్లీ గడ్డపై ఆసీస్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకటి మాత్రమే గెలిచింది. ఇక ఈ వేదికలో 644/8 అత్యధిక స్కోర్‌గా ఉండగా.. 75/10 అతి తక్కువ స్కోర్‌గా ఉంది.
పిచ్ రిపోర్టు
అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ కూడా ఇతర మైదానాల మాదిరిగానే తొలుత బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. అయితే పిచ్ పాతబడే కొద్ది నెమ్మదిగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడి ట్రాక్ నల్లమట్టితో తయారైనందున బంతి పెద్దగా బౌన్స్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కూడా స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశం ఉంది. దీంతో మరోసారి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు కనిపించే ఛాన్స్ ఉంది. కాగా ఇదే పిచ్‌పై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
Also Read: Shahid Afridi: బీసీసీఐని కాదని ఐసీసీ ఏం చేయలేదు: షాహిద్ అఫ్రిదీ