Tirumala: తిరుమల మాడవీధులలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. మాడవీధులలో ఉన్న గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహన సేవలను తిలకించవచ్చని తెలిపారు. గరుడ సేవ రోజు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి వాహన సేవను దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. గరుడ సేవ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డులో ప్రత్యేక క్యూ లైనులు ఏర్పాటు చేశామన్నారు. మాడవీధులలో 6 ప్రాంతాల నుంచి భక్తులను వాహనసేవను తిలకించేందుకు అనుమతిస్తామన్నారు.
Also Read: AP High Court: చంద్రబాబు, నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
తిరుమలలో 17వ తేదీన వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీన శ్రీవారికి పట్టు వస్ర్తాలను సీఎం జగన్ సమర్పించనున్నారు. 22వ తేదీన గరుడ వాహన సేవ, 23వ తేదీన స్వర్ణ రథ ఊరేగింపు జరగనున్నాయి. 27వ తేదీన ధ్వజాఅవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 75,059 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.13 కోట్లు లభించినట్లు టీటీడీ తెలిపింది.