కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. టాలీవుడ్ నుంచి చిరంజీవికి ఆహ్వానం?
అయ్యప్పస్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటిమందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాలనుంచి మండలదీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుందని లేఖలో తెలిపారు. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, ఛానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు.
Read Also: Pannun Case: “పన్నూ కేసు భారత్-యూఎస్ సంబంధాలకు తీవ్ర నష్టం”.. ఇండో-అమెరికన్ నేతల ఆందోళన…
ఇటీవలే.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధకలిగిందని లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న సందర్భంలో.. ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయగలరని మనవిచేస్తున్నాను లేఖలో ప్రస్తావించారు. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో మీరు వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.