Arani Srinivasulu: వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయినందుకు వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత ఆరణి శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేనలో చేరడం.. ఇక ఆ తర్వాత ఆయనకు టికెట్ దక్కడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. అయితే, ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు ఆరణి.. అందులో భాగంగా.. ఈ రోజు తిరుపతి ఎన్.జి.ఓ.కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం.. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేశారు.
Read Also: Weightloss Tips : ఈ టిప్స్ ఫాలో అయితే సులువుగా బరువు తగ్గుతారు..
ఇక, నేను నాన్ లోకల్ కాదు.. లోకలే అన్నారు ఆరణి.. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్లు ఉందన్న ఆయన.. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను.. కానీ, కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టును కాదు.. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను.. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. మరోవైపు ఐదేళ్ల వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం.. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు అని ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసన్నారు. తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఆరణి శ్రీనివాసులు.