ఏపీ రాజకీయం ఢిల్లీకి మారింది. బీజేపీ పెద్దలతో రాష్ట్ర అధినేతల వరుస భేటీలు ఆసక్తిరేపుతున్నాయి. నిన్న కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చర్చించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా.. నిన్న బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు భేటీలో జనసేన, బీజేపీతో పొత్తు ఖరారైందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని పీఎంను కోరనున్నారు సీఎం జగన్. అంతేకాకుండా.. తాజా రాజకీయ అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. గత ఐదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం దగ్గరగా ఉంది. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి ఒక స్పేస్ ఉంది. కాగా.. టీడీపీ – జనసేన- బీజేపీ కూటమి ప్రచారం నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.