ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం ఆదివారం జరగనుంది. అమరావతి నోవాటెల్ హోటల్ 7వ అంతస్థులో జరగనున్న ఈ సమావేశంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర నాయకులు హాజరుకానున్నారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆదివారం ఉదయం 10.15 నుండి 10.30కు హైందవ శంఖారావం సభ విజయవంతంగా నిర్వహించినందుకు విశ్వహిందూ పరిషత్ నాయకులతో అమిత్ షా ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్ నేతలు గోకరాజు గంగరాజు సహా మరో ఐదుగురు హాజరుకానున్నారు. నోవాటెల్ హోటల్లో అమిత్ షా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్ధాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. గన్నవరం మండలం కొండపావులూరులో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం), జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) 10వ బెటాలియన్ ప్రాంగణాలు కేంద్ర హోంమంత్రి ప్రారంభించనున్నారు.