ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటును వినియోగించుకున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్‌సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే నలుగురు సభ్యులు మాత్రం టీడీపీకి ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు. కాగా, ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
మరోవైపు టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయితే అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీలో పనితీరును బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని సమాచారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగడంతో పాటు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది. ఫలితాలు తర్వాత ప్రకటిస్తారు. అయితే.. ఇప్పటి వరకు 107 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : Hospital Bill : ఆస్పత్రి బిల్లు చూశాడు.. ఎలా చావాలో గూగుల్లో సెర్చ్ చేశాడు