ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్ అయ్యారు. కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు ఈరోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు విడుదల అయ్యారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. విజయవాడ జైలు అధికారులు కావాలనే తమని ఆలస్యంగా విడుదల చేశారని నిందితులు తెలిపారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్లను తీసుకుని వారి తరఫు న్యాయవాదులు విజయవాడ జైలు వద్దకు వెళ్లారు. అప్పటికే సమయం పూర్తి కావడంతో వారిని జైలు అధికారులు విడుదల చేయలేదు. ఈరోజు ఉదయం కూడా జైలు వద్ద హైడ్రామా నెలకొంది. జైలర్ బస్సులో వస్తున్నారంటూ అధికారులు చెబుతూ సమయం గడిపారు. దాంతో బెయిల్ ఇచ్చినా కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ముగ్గురు రిలీజ్ అయ్యారు.
Also Read: AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్!
ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు అధికారులు. మరోవైపు ఏసీబీ కోర్టులో నిందితులు పిటిషన్ వేయనున్నారు. బెయిల్ ఇచ్చినా జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 3 గంటల పాటు విడుదల చేయలేదని పిటిషన్ వేయనున్నారు. రేపు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్ వేయనున్నారు.