High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలిని ఈ మధ్యే నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, కొందరు సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. టీటీడీలో నేర చరిత్ర ఉన్న వారు సభ్యులుగా ఉండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..
Read Also: DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. కాంగ్రెస్ నుంచా బీజేపీ నుంచా?
అయితే, ఎండోమెంట్ చట్టాలకు వ్యతిరేకంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి, డాక్టర్ కేతన్, సామినేని ఉదయభాను నియామకం చెల్లదంటూ విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ వేశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి మరియు ఎమ్మెల్యే ఉదయభాను, డాక్టర్ కేతన్ పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని.. పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నేరచరిత్ర వున్నవారు ఉండటం భక్తుల మనోభావాలకి తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక బెయిల్ పై కొనసాగుతున్న నిందితుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రయోజనాలతో ఎన్నిక చేయటం చట్ట విరుద్ధమంటూ తన పిల్‌లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆకుల శేష సాయి, జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న దేవదయ శాఖ కమిషనర్, తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని వివరణ కోరింది.. తమకు వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.