Site icon NTV Telugu

AP High Court: బిగ్‌బాస్‌ షోను సెన్సార్ చేయకపోతే ఎలా?.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Ap High Court

Ap High Court

AP High Court: బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది. ఇప్పుడు ఈ షో ప్రసారం కావడం లేదన్న కారణంతో కోర్టు కళ్లు మూసుకుని ఉండలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవ­హారంపై లోతుగా విచారణ జరుపు­తామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.

Also Read: Heavy Floods: మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం

బిగ్‌బాస్‌ షో అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండు పిల్స్‌పై హైకోర్టులో జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసా­దరావు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సెన్సార్‌ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ షోను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలని కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో ప్రసారం కావడం లేదని ప్రతివాది తరఫు లాయర్ వాదించారు. ఈ పిల్స్‌పై విచారణ సరికాదని.. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్‌ వేయడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.

బిగ్‌బాస్‌ షో ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ విధానం లేదనిస్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెట్‌ మాటీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రసారం అయ్యాక అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చని.. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు వ్యవస్థ ఉందన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్‌షిప్‌ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని కోర్టు ముందు ప్రస్తావించారు. బిగ్‌బాస్‌ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్‌ మార్చుకోవచ్చని.. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకునే పరిధి తక్కువ అన్నారు.

Also Read: Vanama Venkateshwar Rao: వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు మరోసారి షాక్

వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యంతర ప్రసారాల విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాలని బిగ్‌బాస్‌ షో నిర్వాహకులను ఆదేశించింది. కార్యక్రమానికి ముందే సెన్సార్‌షిప్‌ లేకపోతే ఎలా? ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనమన్న ధర్మాసనం.. అది పోస్టుమార్టం చేయడమే అవుతుందని పేర్కొంది. ఒకవేళ ప్రతీ ఛానల్‌ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన యంత్రాంగం లేకపోతే ఎలా.. నైతిక విలువలను కాపాడకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని.. హైకోర్టుకు ఉన్న విచారణాధికార పరిధికి అనుగుణంగా బిగ్‌బాస్‌ షో ప్రసారానికి ముందే సెన్సార్‌ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది. . తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version