AP Heat Wave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8°C, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, కర్నూలు జిల్లా తోవిలో 42.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 42.6°C, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురం, పల్నాడు జిల్లా గురజాలలో 42.5°C, అన్నమయ్య జిల్లా నూలివీడులో 42.4°C, అనంతపురం జిల్లా రాయదుర్గం, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 42.1°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని వెల్లడించారు. మంగళవారం (మే 19) విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C నుంచి 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 20, 21 తేదీల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు ఉండనున్నాయి. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రేపు రాష్ట్రంలోని 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రమై 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 255 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
