AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిరంతరాయంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ బాధ్యతల్లో భాగస్వాములైన వివిధ శాఖల అధికారుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది స్థానచలనం లేకుండా ఒకే చోట విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హులైన కొత్త ఓటర్ల నమోదుతో పాటు బోగస్ ఓట్ల తొలగింపు, సవరణలపై యంత్రాంగం దృష్టి సారించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చిన వినతులన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని సెప్టెంబర్ 28 నాటికి సంపూర్ణంగా పరిష్కరించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియలన్నింటినీ ముగించి, అక్టోబర్ 3వ తేదీన ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు.

ముఖ్యంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROలు), ఈఆర్వోలతో పాటు ఈ ప్రక్రియలో నేరుగా పాల్గొంటున్న కీలక ప్రభుత్వ అధికారులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. విధుల్లో ఉన్న అధికారులు మధ్యలో మారితే ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ పనుల వేగం మందగించే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం ఈ బదిలీల నిషేధ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురణ పూర్తయ్యేంత వరకు ఎస్ఐఆర్ ఉద్యోగుల బదిలీలపై నిషేధం నిబంధన ఖచ్చితంగా అమల్లో ఉంటుంది.