NTV Telugu Site icon

AP Assembly: నేడు శాసన సభ ముందుకు 3 కీలక బిల్లులు.. దానిపైనే టీడీపీ వాయిదా తీర్మానం

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం తొలిరోజు అసెంబ్లీ సమావేశాలను కుదిపివేసింది.. ఈ సందర్భంగా మీసాలు మిలేయడాలు, తొడగొట్టడాలు రచ్చరచ్చగా మారాయి.. ఇక, టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు స్పీకర్‌.. అయితే, రెండో రోజు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ రోజు ఉదయం 9 గంటలకే సమావేశం కానుంది అసెంబ్లీ.. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ఆరభించనున్నారు.. మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు, దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాలపై ప్రశ్నలు వేయనున్నారు.

అయితే, ఈ రోజు సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023 లాంటి కీలక బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు.. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం – తీసుకున్న చర్యలపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్టు అక్రమం అనే అంశంపై చర్చకు పట్టుబట్టేందుకు సిద్ధం అవుతోంది టీడీపీ.. దీనిపైనే రెండో రోజు కూడా అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గకూడదని టీడీపీ భావిస్తోంది.. శాసనమండలిలోనూ ఇలాగే వ్యవహరించాలని నిర్ణయం.

స్కిల్‌ కేసులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్‌ అనుమతిస్తే… తమకూ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది. చంద్రబాబును తక్షణం విడుదల చేసి.. సీఎం వైఎస్‌ జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే అజెండాతోనే రెండో రోజూ శాసనసభ, మండలికి తెలుగుదేశం నేతలు వెళ్లనున్నారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ రెండో రోజూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని ఉభయ సభల్లో పట్టు పట్టబోతోంది.. దీంతో.. రెండో రోజూ కూడా అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగనున్నాయి.