AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటైంది. సీఈసీ ఆదేశాలతో సిట్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ విచారణ జరపనుంది. 13 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. రెండు రోజుల్లో ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్‌స్పెక్టర్లు భూషణం, కె.వెంకట్‌రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్.ప్రభాకర్‌రావు, శివప్రసాద్‌లు ఉన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా
సిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. ఇప్పటికే ఏపీకి 20 కంపెనీల పారామిలటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండెంచల నుంచి మూడెంచలకు పెంచారు. స్ట్రాంగ్ రూంల, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఏపీ సీఈఓ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.
