AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లోకి తెచ్చిన సర్కార్.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ పెట్టింది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టింది. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు.. మొత్తంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.. ఈ పథకం అమలు చేస్తే చేయాల్సిన పనులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Hyderabad: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ముందే డ్రగ్స్ కలకలం.. ఓ పబ్‌లో డ్రగ్స్ పార్టీ
కాగా, మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి ప్రభుత్వం.. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్‌గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం.. ఈ కమిటీ కన్వీనర్ గా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని నియమించింది.. కమిటీ సమావేశాలు నిర్వహించడం, కమిటీ ఇచ్చే సమాచారం పొందుపరచడం వంటి బాధ్యలను కన్వీనర్‌కు అప్పగించింది.. సాధ్యమైనంత త్వరగా సదరు రాష్ట్రాల్లో పర్యటనలు ముగించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..